
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దోమలగూడ నుంచి చేపట్టిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలను తెలసుకోవడానికే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న పాలకులను గద్దె దించేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
రాహుల్ పాదయాత్రతో దేశప్రజలను ఐక్యం చేసి ... ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వచ్చే నెల 1న హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్ గాంధీ కు ఘనస్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. రాహుల్ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు.